తెల్ల‌బ‌ట్ట ఎందుకొస్తుంది..? ఆ స‌మ‌యంలో ఏం చేయాలి..?

white discharge causes

తెల్ల‌బ‌ట్ట ఎందుకొస్తుంది..? ఆ స‌మ‌యంలో ఏం చేయాలి..?

ఎంతో మంది బాలిక‌లు, మ‌హిళ‌లు త‌మ ఆరోగ్యం గురించి ఏ మాత్రం శ్ర‌ద్ధ తీసుకోరు. ఎంత బాధ వ‌చ్చినా త‌మ‌లో తామే కుమిలిపోతారు. ఫ్యామిలీ వాళ్ల‌కు చెబితే మంచిగా ఉండ‌ద‌నో.. డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు పోతే ఇంజ‌క్ష‌న్ ఇస్తుంద‌నో.. చెప్ప‌కుండా అన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దాచి పెడుతుంటారు. ఇలా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దాస్తే.. ఎన్నో రోగాలు వ‌స్తాయ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వైద్యుల‌ను సంప్ర‌దిస్తే.. వెంట‌నే దాన్ని న‌యం చేయొచ్చని సూచిస్తున్నారు.

 

అయితే మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌గా వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌ల్లో తెల్ల‌బ‌ట్ట ఒక‌టి. ఈ స‌మ‌స్య ఉంటే ఆల‌స్యం చేయ‌కుండ డాక్ట‌ర్ ను సంప్ర‌దించాలి. లేక‌పోతే దాని వ‌ల్ల మీకు ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే ఇది రాగానే ఏదో పెద్ద రోగం వ‌చ్చింద‌ని భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇది ప్ర‌తీ మ‌హిళ‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌నే. డాక్ట‌ర్ ను సంప్ర‌దిస్తే వెంట‌నే న‌యం అయిపోతుంది. అయితే మ‌న నోట్లో ఉమ్మి ఎలా తయారవుతూ ఉంటుందో అలాగే మహిళల జననేంద్రియాల నుండి కూడా ఒక తెల్లని స్రా‌వం ఒక‌టి త‌యార‌వుతూ ఉంటుంది. ఆ స్రావాన్నే మ‌న‌ వాడుక భాష‌లో తెల్లబట్ట అని పిలుస్తారు. దీనికి ల్యూకోరియా అని పేరు.

 

ఇది గర్భాశయ ముఖ ద్వారంలో ఉండే గ్రంథుల నుంచి వ‌స్తుంది. ఆ గ్రంథుల నుంచి వ‌చ్చే స్రావం యోని మార్గంలోకి వ‌స్తుంది. ఇక యోనిమార్గంలో ఎలాంటి గ్రంథులు ఉండవు. ఆ స్రావంలో ద్రవ పదార్థంతో పాటుగా కొన్ని మృత కణాలు, జననేంద్రియాలకు మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటుంది. వీటిని డోడర్ లైన్ బాసిల్లై అని పిలుస్తారు. ఇవి వెజైనల్ PHని మెయింటైన్ చేయ‌డానికి ఉప‌యోగ ప‌డుతుంటాయి. దీంతో వ్యాధిని క‌లుగజేసే సూక్ష్మజీవులు జననేంద్రియాల్లోకి ప్ర‌వేశించ‌లేవు.

ఇలా జ‌న‌న‌మార్గం త‌డిగానూ, ఆరోగ్యంగాను ఉండ‌టానికి ఉప‌యోగ‌ప‌డే ఈ స్రావం.. సూక్ష్మ‌జీవులు శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌కుండా ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే రోజుకు దాదాపు 10 మిల్లీ లీటర్ల వరకు ఈ తెల్లబట్ట క‌నిపిస్తుంది. కొన్ని ప్ర‌త్యేక‌ పరిస్థితుల్లో మాత్రం ఇది ఎక్కువవుతుంది. ఇలా తెల్ల‌బ‌ట్ట ఎక్కువ కావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను రెండు వ‌ర్గాలుగా చెప్పుకోవ‌చ్చు. 1. ఫిజియొలాజికల్ ల్యుకోరియా 2. పెథలాజికల్ ల్యుకోరియా.

 

ఏ తెల్లబట్టతో ప్రమాదమూ ఉండ‌దు?

పైన చెప్పిన రెండు తెల్ల‌బ‌ట్ట‌ల్లో ఒక దానివ‌ల‌న ఏ జ‌బ్బు రాదు. అదే ‌ఫిజియొలాజికల్ ల్యూకోరియా. ఈ తెల్ల‌బ‌ట్ట‌కు చికిత్స కూడా అవసరం లేదు. ఈ తెల్లబట్ట తెల్లగా ఉంటుంది. దీని వ‌ల‌న‌ దుర్వాసన, దురద వంటి సమస్యలేమీ ఉండవు. ఈ తెల్ల‌బ‌ట్ట కావ‌డానికి కార‌ణం శారీరకంగా, మానసికంగా ఉద్రేకానికి గురి కావ‌డం. ఇది దాదాపు అన్ని వయసులవారికి వ‌స్తుంది.

ఇంకా చెప్పాలంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డలలో కూడా ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించొచ్చు. పుట్టిన వారం రోజులలోపు ఆ బిడ్డ‌లో తెల్లబట్ట కానీ, ఎర్రబట్ట కానీ క‌న‌ప‌డినా ఆశ్చ‌ర్య పోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. తల్లి కడుపులో ఆ బిడ్డ ఉన్నపుడు రక్తంలో ప్రవహించిన హార్మోన్ల స్థాయి బయటకు రాగానే తగ్గిపోతుంది. దీంతో ఈ తెల్ల‌బ‌ట్ట వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనికి చికిత్స ఏం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అదే త‌గ్గిపోతుంది.

ఇక 10 నుంచి 12 యేండ్ల వ‌య‌సులో ఉండే ఆడ‌పిల్ల‌ల్లో రజస్వల కావడానికి ముందు 3 నుంచి 6 నెలల పాటు తెల్లబట్ట అవుతుంది. జననావయవాల పెరుగుదల, రక్త సరఫరా ఎక్కువ కావడాన్నీ ఈ తెల్ల‌బ‌ట్ట సూచిస్తుంది. దీనికి కూడా చికిత్స అవసరం లేదు. అలాగే బహిష్ఠు రావడానికి నాలుగైదు రోజుల ముందు కూడా తెల్లబట్ట కనిపించే అవ‌కాశం ఉంది. ఇది సర్వ సాధారణం.

తెల్ల‌బ‌ట్ట ఎప్పుడు ప్ర‌మాదంః

ఈ తెల్లబట్ట రంగుమారితే స‌మ‌స్య ఉన్న‌ట్లు అర్థం. ఇది కొంచెం పసుపు రంగులో లేక‌పోతే ఆకుపచ్చ రంగులో క‌నిపిస్తూ.. దుర్వాసనతో ఉండే స‌మ‌యంలో జాగ్ర‌త్త ప‌డాలి. అలాగే ఈ స‌మ‌యంలో దురద ఉంటుంది. దీన్నే పెథలాజికల్ ల్యూకోరియా అని పిలుస్తారు.

దీనికి కారణాలుః

ట్రైఖోమోనాస్ వజైనాలిస్ ఇన్ ఫెక్షన్ః చాలా మందిలో ఇది క‌న‌బ‌డుతూ ఉంటుంది.దీనివ‌ల‌న దుర్వాసనతో కూడిన ఆకుపచ్చ రంగు స్రావాలు విడుద‌ల అవుతాయి. లైంగిక సంబంధాల వ‌ల‌న ఒక‌రి నుంచి ఇంకొక‌రికి ఇది సోకుతుంది. దీనికి చికిత్స భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ తీసుకోవాలి.

క్లమీడియా ఇన్ ఫెక్షన్ః క్లమీడియా ట్రైఖోమాటిస్ అనే సూక్ష్మజీవి వ‌ల‌న వ‌స్తుంది. ఇది లైంగిక సంపర్కం వ‌ల‌న సోకుతుంది. దీనికి త‌ప్ప‌కుండా చికిత్స చేయించుకోవాలి. అలాగే మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లో కనిపించే లక్షణం ఈ తెల్లబట్ట. కాబట్టి డాక్ట‌ర్ సంప్ర‌దించ‌డం చాలా ఉత్త‌మం.

జాగ్ర‌త్త‌లుః

ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. కాటన్ లోదుస్తుల‌ను వాడాలి. బహిష్ఠు సమయంలో త‌ప్ప‌ని స‌రిగా శానిటరీ నాప్కిన్స్ ను వాడాలి. అలాగే వాటిని ప్రతి రెండు గంటలకూ ఒక‌సారి మార్చుకోవాలి. మీకు సోకిన తెల్ల‌బ‌ట్ట ప్ర‌మాదక‌ర‌మైంది అయితే వైద్యులు చికిత్స చేస్తారు. కానీ ముందు మీరు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం చాలా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *