వణుకుడు రోగం ఎందుకొస్తుంది అంటే?

parkinsons-disease

పార్కిన్స‌న్స్ వ్యాధి గురించి తెలుసుకోవ‌ల‌సిన విష‌యాలు!

పార్కిన్సన్స్ వ్యాధి ఈ పేరు కొత్తగా అనిపించొచ్చు. కానీ ఈ వ్యాధి మీకు తెలిసిందే.. మీ చుట్టుప‌క్క‌ల‌ వాళ్లు ఎంతో మంది ఈ వ్యాధితో బాధ ప‌డుతూనే ఉంటారు. దీంతో రోగులు వ‌ణుకుతూ ఉంటారు. దీన్ని వ‌ణుకుడు రోగం అని కూడా పిలుస్తారు. ఇది న‌రాల‌కు సంబంధించిన వ్యాధి. మెదడులోని కొన్ని నాడీ కణాలు దెబ్బతిన‌డం వ‌ల‌న ఈ వ‌ణుకుడు రోగం వ‌స్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే డోపమైన్ రసాయనం తయారు చేసే కణాలు దెబ్బతిన‌డం వ‌ల‌న ఈ రోగం వ‌స్తుంది. దీంతో చేతులు వణికే సమస్య వ‌స్తుంది. ఇది క్ర‌మంగా కాళ్ల‌కు కూడా పాకుతుంది.

‘డోపమైన్’ అని పిలిచే న్యూరోట్రాన్స్మిటర్ ద్వారా మెదడు అంతటా సంకేతాలు ప్రసరించే బాధ్యత నాడీ క‌ణాల‌కు ఉంటుంది. మాములుగా మృదువైన, సమతుల్య కండరాల సమన్వయాన్ని డోపమైన్ సహాయంతో పొందుతుంది. ఈ డోపామైన్ లేకపోవడం వ‌ల‌నే ఇది సంభ‌విస్తుంది.

 

పార్కిన్స‌న్స్ వ్యాధి లక్షణాలుః

ఈ రోగం వ‌చ్చిన కొత్త‌లో సాధారణ లక్షణాలు క‌నిపిస్తాయి. వాటిలో శరీరంలోని అవయవాల్లోని ఎదో ఒక భాగంలో వ‌ణుకుడు వ‌స్తుంది. ముఖ్యంగా చేతులు లేక‌పోతే కాళ్ళు లేక‌పోతే దవడ లోనైనా వణుకుడు వ‌స్తుంది. చేయిని క‌ద‌ప‌కుండా ఉంచినా కానీ వణుకు వ‌స్తుంది. దీన్ని సాధారణంగా గుర్తించొచ్చు. మాములుగా ఆ రోగం వ‌చ్చిన వ్య‌క్తుల్లో చూపుడు వేలుకు వ్యతిరేకంగా బొటనవేలు కదలికను గ‌మ‌నించొచ్చు.

దీని ఇంకో ల‌క్ష‌ణం కండరాలు బిగదీయడం. ఈ రోగం మనిషి స్వేచ్చా చలన వలయాల్ని కుంటుపరుస్తూ ఉంటుంది. దీంతో అనియంత్రితమైన కండరాల పట్టేస్తుంటాయి. ఇది ఈ వ్యాధి ల‌క్ష‌ణాల్లో ఒక‌టి. ఈ రోగం వ‌చ్చిన వ్యక్తులు పనిని వేగంగా చేయ‌లేరు. స్నానం, తినడం లాంటి ప‌నులు చేసేట‌ప్పుడు కూడా వీళ్లు అసాధార‌ణంగా ఎక్కువ‌సేపు తీసుకోవాల్సి వ‌స్తుంది.

ఈ రోగం రాను రాను ఎంతో క్షోభ‌కు గురి చేస్తుంది. అలాగే ప‌లు లక్షణాలు క‌నిపిస్తాయి. వాటిల్లో సంతులనంలో నష్టం, నిరాశ, ముఖంలో వెలువడే భావాల్ని ముసుగులో దాచిన‌ట్లు క‌న‌ప‌డ‌టం, గూని రావ‌డం. ఇంకా కొన్ని లక్షణాలలో భయము, చొంగ కార్చడం, చర్మ సమస్యలు, మూత్ర సమస్యలు ,లైంగిక అసమర్థత వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ రోగం వ‌చ్చిన వ్య‌క్తికి వ‌చ్చే ఈ వణుకుడు ఆయ‌న మాటల్ని ,చేతివ్రాతను దెబ్బ తీస్తుంది.

ప్రధాన కారణాలుః

ఈ వణుకుడు రోగానికి కార‌ణాలు ఎంట‌నేది పూర్తిగా తెలియ‌లేదు. దీనిపై ఇప్ప‌టికీ ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే జన్యు కారకాలు , కొన్ని పర్యావరణ పరిస్థితులు ఈ రోగానికి కార‌ణం కావొచ్చ‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. పార్కిన్సన్స్ వ్యాధిని అభివృద్ధి చేయడంలో జన్యుపరివర్తనలు ప్రమాద కారకంగా గుర్తించారు. కానీ ఖచ్చితమైన ఆధార‌లు మాత్రం లేవు.

అలాగే వ్యవసాయంలో ఉపయోగించే పురుగుమందులు కూడా ఈ వ్యాధిని తెచ్చే అవ‌కాశం ఉంది. ఇది ప‌ర్యావ‌ర‌ణ ప్రమాద కారకం. అలాగే యాంటిసైకోటిక్ ఔషధాలను తీసుకునే వ్యక్తులు, మెదడు అనారోగ్యంతో బాధపడుతున్నవారిలో, కొంత కాలంగాస్ట్రోక్ లకు గురై బాధపడుతున్న వ్యక్తులకు ఈ వణుకుడురోగం వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

చికిత్సః ఈ రోగాన్ని నిర్ధారించడానికి నిర్దిష్ట ప‌రీక్ష లేదు. అందుకే పార్కిన్స‌న్స్ వ్యాధిని నిర్దారించ‌డం గంద‌ర‌గోళంగా ఉంటుంది. అంతేకాకుండా తరచూ కీళ్ళ అసాధారణతలు, విటమిన్ లోపాల వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. సిటి(CT) స్కాన్, ఎంఆర్ఐ (MRI) స్కాన్ ద్వారా ప‌లు విష‌యాల‌ను తెలుసుకునేందుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని అనుభ‌వం గ‌ల న్యూరాలజిస్ట్ చూపి ప‌లు విష‌యాల‌ను నిర్ధారించుకుంటాడు. అలాగే కొన్ని రోజుల పాటు లక్షణాలను ప‌రిశీలిస్తాడు.

ఇక చికిత్సకు సంబంధించినంత వరకు దీనికి ప‌లు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులు వ్యాధికి గురైన మెదడు భాగాలను ప‌ని చేసేలా చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే దీర్ఘకాలికదశలో ఈ మందులు దుష్ప్రభావాలను చూపే అవ‌కాశం ఉంది. అయితే మందులు వ్యాధిలక్షణాలను నియంత్రించలేకుంటే, శస్త్రచికిత్స చేయాల‌ని డాక్ట‌ర్లు నిర్ధారిస్తారు. మెదడును ప్రేరేపించటానికి ఎలక్ట్రోడ్లను వాడుతారు. ఇలా చేయడం వ‌ల‌న‌ వణుకుడును ప్రేరేపించడానికి దారి తీసే ప్రేరణల్ని అడ్డుకోవ‌చ్చు.

ఈ వ‌ణుకుడు రోగం ఒక ప్రగతిశీల రుగ్మత. దీనికి ఖచ్చితమైన నివారణ లేదు. అయినా కానీ మానసిక, శ‌రీర‌క ఆరోగ్యంగా ఉంటే దీన్ని రాకుండా చేయొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *