వేసవికాలంలో పనస పండు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి?

jackfruit-nutrition-benefits

వేసవికాలంలో పనస పండు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి?

పనస చెట్టు నైరుతి భారతదేశానికి చెందిన ఒక ఉష్ణమండల చెట్టు. పనస చెట్టు మొరాసి మొక్కల కుటుంబానికి చెందినవి.ఎక్కువగా వేసవి కాలంలో లభించే పనసపండును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పనస పండుని జాక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. చూడటానికి పసుపు రంగులో ఉండి ఎంతో తీపి రుచిని కలిగి ఉంటుంది. పనస పండు ప్రపంచంలో కెల్లా అతిపెద్ద పండు అని చెప్పవచ్చు. పనస పండు ఆపిల్ ,పైనాపిల్, అరటి పండు రుచుల కలయికతో ఏర్పడి ఉంటుంది. తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

ఇందులో విటమిన్లు, ఫైబర్ లు, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషక గుణాలు అధికంగా ఉంటాయి. మాంసాహారం తినని వారు మాంసం స్థానంలో పనస పండును తీసుకోవడం వల్ల అదే స్థాయిలో పోషకాలను పొందవచ్చు. వేసవి కాలంలో ఎంతో విరివిగా లభించే ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

1)కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది:

పనస పండులో తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, అధిక సాంద్రత కలిగిన లిపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. మన శరీరంలో ఏర్పడిన చెడు కొలెస్ట్రాల్ గోడలకు అడ్డుపడి రక్తసరఫరా పై ప్రభావం చూపిస్తాయి. ఈ విధంగా రక్తం సరఫరాలో అవకతవకలు ఏర్పడటం వల్ల ఈ ప్రమాదం గుండె పనితీరు పై పడుతుంది.కనుక పనస పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల ఇది మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పూర్తిగా కరిగించి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. దీని ద్వారా కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు.

2) రక్తపోటును నియంత్రిస్తుంది:
పనస పండులో అధిక భాగం పొటాషియం ఉండటం వల్ల ఇది మన శరీరంలో ఏర్పడే అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. పొటాషియం, సోడియం ప్రభావాలను ఎదుర్కోవటం ద్వారా రక్తనాళాల గోడలపై ఒత్తిడి తగ్గి రక్త పోటును నియంత్రిస్తుంది. అయితే పొటాషియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు మూత్రపిండ వ్యాధి సమస్యలతో బాధపడే వారిలో పొటాషియం నియంత్రించే విధానాన్ని మార్చి ఏదైనా పరిస్థితికి హానికరం.

3) క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది:
పనసపండులో ఫైటోకెమికల్స్ అనే ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. ఈ ఫ్లేవనాయిడ్లు మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి వల్ల ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను శరీరం నుంచి బయటకు పంపివేస్తాయి. అదేవిధంగా ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కణాల చుట్టూ మరే ఇతర కణాలు పెరగకుండా నిరోధిస్తుంది.

4) రక్తహీనతను నివారిస్తుంది:
పనసపండులో ఎక్కువ భాగం ఐరన్ లభించటం వల్ల ఇది మన శరీరంలో రక్త హీనతను నివారిస్తుంది. పనస పండు విత్తనాలు ఐరన్ గొప్ప మూలకం కావటంవల్ల రక్తహీనతతో ఏర్పడే సమస్యలను, ఇతర రుగ్మతలు నుంచి మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా ఐరన్ మన మెదడు పని తీరును మెరుగు పరచడమే కాకుండా గుండెకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.

5) అజీర్ణాన్ని నివారిస్తుంది:
పనసపండు విత్తనాలను బాగా ఎండబెట్టి వాటిని పొడి చేసుకొని మన ఇంట్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఇవి జీర్ణక్రియ సమస్యలు ఏర్పడినప్పుడు లేదా మలబద్ధకం సమస్యతో బాధపడేటప్పుడు పనస పండు పొడిని కొద్దిగా నీటిలో కలుపుకొని త్రాగటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా పనసపండు లో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆహార పదార్థాలను తేలికగా జీర్ణం చేసి మలబద్ధకం సమస్యను కూడా నివారిస్తుంది.

6) కండరాలను నిర్మిస్తుంది:
పనస పండు విత్తనాలు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ లను కలిగి ఉంటాయి. ఈ ప్రోటీన్లు కండరాలను నిర్మించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.జాక్ ఫ్రూట్ నుంచి మనకు లభించే ప్రొటీన్లు కండరాల పెరుగుదలకు కీలక పాత్ర పోషించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

7) కంటిచూపును మెరుగుపరుస్తుంది:
పనసపండు ఎక్కువ భాగం విటమిన్ ఏ కలిగి ఉండటం వల్ల ఇది కంటి చూపును మెరుగు పరచడంలో దోహదపడుతుంది. కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలు విటమిన్ ఎ కీలకమైనది. పనస పండులో విటమిన్ ఎ తోపాటు ఇ కూడా పుష్కలంగా లభించడం వల్ల ఇది కంటి చూపును మెరుగు పరచడంతో పాటు జుట్టు ఆరోగ్యానికి కూడా సంరక్షిస్తుంది. తలలో ఏర్పడిన చుండ్రు లేదా జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నుంచి పూర్తిగా మనకు రక్షణ కల్పిస్తుంది.

8) మానసిక ఒత్తిడి, చర్మవ్యాధుల నుంచి కాపాడుతుంది:
మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యే వారికి ఈ పనసపండు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. పనస పండులో అధిక భాగం ప్రోటీన్లు మరియు ఇతర సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఇది మానసిక ఒత్తిడిని మరియు ఇతర చర్మ వ్యాధులను తగ్గించడానికి దోహదపడతాయి.

9) చర్మం పై ఏర్పడిన ముడుతలను తొలగిస్తుంది:
చాలామంది అతి చిన్న వయసులోనే చర్మంపై ముడతలు ఏర్పడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఈ విధంగా మొహం పై ముడతలు ఏర్పడిన వారికి పనసపండు చక్కటి పరిష్కార మార్గం. పనసపండు విత్తనాలను నానబెట్టి వాటిని మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి రుద్దటం వల్ల ముఖం పై ఏర్పడిన నల్లటి మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. అదే విధంగా ఈ మిశ్రమంలోకి తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా వేసుకోనీ అరగంట పాటు ఆరనివ్వాలి.తరువాత ఈ మిశ్రమాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయడం వల్ల ముఖం ఎంతో కాంతి వంతంగా ఉంటుంది.

10) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
వేసవి కాలంలో లభించే పండ్లను తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా ఈ పండులో విటమిన్ ఎ విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.ఈ విటమిన్లు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడానికి దోహదపడతాయి.మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియాలతో పోరాడి ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా మనల్ని రక్షిస్తుంది.

పనస పండు తినటం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
పనసపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరిలో ఇవి కొన్ని దుష్పరిణామాలను కలిగిస్తాయి. కొందరిలో ఈ పనస పండు తినడం వల్ల అలర్జీలు తలెత్తుతుంటాయి. అదేవిధంగా పనసపండులో రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి కనుక మధుమేహంతో బాధ పడుతూ మందులను ఉపయోగించే వారు ఎక్కువగా పనస పండ్లు తినటం వల్ల వారి రక్తంలోని చక్కెర స్థాయి తగ్గిపోయి కొన్ని ప్రమాదాలు తలెత్తుతాయి. పనస పండ్లు తింటూ మధుమేహానికి మందులు వాడే వారు వారి మందులను మార్చవలసి ఉంటుంది.

ఏ విధంగా తినాలి:
పనస పండును చాలా మంది వివిధ రకాల పద్ధతులలో తింటూ ఉంటారు. కొందరు పనసపండును పచ్చిగా తినడానికి ఇష్టపడితే మరి కొందరు దీనిని ఉడికించి పాలతో కలిపి తీసుకుంటారు.మరికొందరు ఈ పనసపండును వివిధ రకాల ఆహార పదార్థాలలో ఉపయోగించి తీసుకుంటారు. ఎక్కువగా వేసవి కాలంలో లభించే ఈ పండ్లు లభిస్తాయి.అయితే కిరాణా దుకాణాల్లో వీటిని డ్రైఫ్రూట్స్ రూపంలో ఈ ఏడాది పొడవునా పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *