ప‌రుగుల‌తో కూడిన మీ జీవితంలో ఒత్తిడిని ఇలా అధిగ‌మించండి!

how-avoid-tension-stress

ప‌రుగుల‌తో కూడిన మీ జీవితంలో ఒత్తిడిని ఇలా అధిగ‌మించండి!

పొద్దున్నే లేసింది మొద‌లు రాత్రి ప‌డుకునే వ‌ర‌కు ఎప్పుడూ ఎదో ఒక ప‌ని. ఆ ప‌నితో పాటు ఎంతో ఒత్తిడి. ఆ ఒత్తిడి పెట్టే బాధ అంతా ఇంతా కాదు. మ‌న‌ల్ని అది తీవ్రమైన క్షోభ‌కి గురి చేస్తుంది. ఒక్కోసారి దాని వ‌ల‌న‌ ఎందుకు బ్ర‌తుకుతున్నాం అనే భ‌యంక‌ర‌మైన ఆలోచ‌న‌లు కూడా వ‌స్తాయి. వీటిని ఎంతో జాగ్ర‌త్త‌గా అధిగ‌మించాలి. లేక‌పోతే.. తీవ్ర‌మైన ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ ఒత్తిడిని త‌ట్టుకోవాలంటే ముందు మీరు దృఢంగా ఉండాలి. మంచి ఆలోచ‌న‌లను క‌లిగి ఉండాలి.

ఈ ఒత్తిడికి కార‌ణం రోజు మ‌నం సవాళ్ల‌ను ఎదుర్కోవ‌ల‌సి రావ‌డ‌మే. దీంతో రోజూ ఒత్తిడికి లోనవుతుంటాం. అయితే మ‌రికొంద‌రైతే.. ప్రతీ చిన్న విషయానికి మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే దీనికి కార‌ణం మ‌న శ‌రీరంలో విడుద‌ల‌య్యే హార్మోనులు సాధార‌ణ‌మైన వేగంతో కాకుండా ఎక్కువ వేగంగా ప‌నిచేయ‌డం వ‌ల‌న ఈ ఒత్తిడి పెరుగుతుంది.ఈ ఒత్తిడే క‌నుక రోజు ఉంటే..అది శ‌రీరానికి, మాన‌సిక సామ‌ర్థ్యానికి హాని చేసే ప్ర‌మాదం ఉంది. అయితే కొన్ని ప‌నుల ద్వారా ఈ ఒత్తిడిని త‌గ్గించుకోవ‌చ్చు. ఆ చిట్కాల‌ను పాటిస్తే.. కొంత ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతాము.

అయితే ఇంకో విష‌యం గుర్తుపెట్టుకోవాలి. నేటి సమాజంలో ఎంతో మంది ఈ ఒత్తిడి వ‌ల‌న ఎన్నో జ‌బ్బుల‌ను కొని తెచ్చుకుంటున్నారు. ఒక స‌ర్వేద్వారా తేలిన విష‌యం ఏంటంటే.. 90 శాతం ఒత్తిడి వ‌ల‌న‌ పలు జబ్బుల‌ను కొని తెచ్చుకుంటున్నార‌ని తేలింది. అయితే మన శరీరం లేకుంటే మ‌న మనసు ఏదైనా పనిలో నిమ‌గ్న‌మైప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఆ స‌మ‌యంలో మ‌న శ‌రీరంలో మెటబాలిజమ్ ఎంతో వేగంగా పెరుగుతుందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. దీని వ‌ల‌న రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం జ‌రుగుతుంది. ఇలా జ‌ర‌గడం వ‌ల‌న శరీరంలో ప‌లు మార్పులు వ‌స్తాయి. ఈ మార్పుల వ‌ల‌న‌ శరీరంలో రక్త ప్రస‌ర‌ణ‌ వేగంగా జ‌రుగుతుంది.

అలాగే మ‌న శరీరంలో ఎడ్రినల్ శాతం కూడా చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితి రోజూ వ‌స్తుంటే.. మ‌నం మానసికంగా, శారీరకంగాను ఎంతో ఇబ్బందులు ప‌డ‌తాము. ఇలా మ‌న‌ల్ని మాన‌సిక ఒత్తిడికి గురిచేసే టెన్షన్ ను తగ్గించుకోవడానికి ప‌లు మార్గాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయిపోతే స‌రి మ‌న శ‌రీరం, మ‌న‌సు ప‌దిలంగా ఉంటుంద‌ని ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. ఈ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.

 

ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకోవ‌ల‌సిన‌ ఆహారంః

ఈ ఒత్తిడిని త‌గ్గించేందుకు మ‌నం కొన్ని ఆహార నియ‌మాల‌ను పాటించాలి. ఇలా మ‌న శరీరానికి తగ్గట్టు ఆహార పదార్థాలను తీసుకుంటే మ‌న‌లో ఏర్పడే ఒత్తిడి త‌గ్గుతుంది. అలాంటి ఆహారంలో ముఖ్యంగా చెప్పుకోవ‌ల‌సిన‌వి.. కమలాపండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్. వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం మనిషిలోని మెదడుకు బలాన్ని ఇస్తుంది. అలాగే బంగాళా దుంపలో విటమిన్ బీ ఎక్కువ‌గా దొరుకుతుంది. దీంతో ఒత్తిడిని దూరం చేయొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే బియ్యం, చేపలు, బీన్స్, ధాన్యాలలో విటమిన్ బీ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఆహారంగా తీసుకోవడం వలన మెదడుకు సంబంధించిన జబ్బులను నివారించొచ్చు. అలాగే ఇవి ఒత్తిడిని తగ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఆకు కూరలు, గోధుమలు, సోయాబీన్, వేరుశెనగ గింజలు, మామిడి పండు, అరటిపండ్ల‌ను కూడా ఎక్కువ‌గా తినాలి. ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం ఎక్కువ‌గా ఉండే ఆహారం వ‌ల‌న ఒత్తిడిని త‌గ్గించుకోవ‌చ్చు.

అయితే ఒత్తిడిని దూరం చేసేందుకు కొన్ని మెళుకువ‌ల‌ను పాటించాలి. అందులో ముందుగా చెప్పుకునేది.. మ‌నం తీసుకునే ఆహారాన్ని కొద్ది-కొద్దిగా ఎక్కువ‌సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల‌న శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.

మనసులో ఏదీ దాయొద్దుః

మీకు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. దాన్ని మీ మ‌న‌సులోనే పెట్టుకుని ఉండిపోకండి. అలా ఉండ‌టం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీ స‌మ‌స్య‌ను మీ భాగ‌స్వామితో పంచుకుంటే.. కొంత మీ ఒత్తిడిని త‌గ్గించుకోవ‌చ్చు. అలా కాకపోతే మీ స్నేహితుడితో అయినా కొంత స‌మ‌యం గ‌డిపి మీ మ‌న‌సులోని మాట‌ల‌ను చెప్పండి దాంతో మీకు ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే మంచి ఆహారం, వ్యాయామం చేయ‌డం కూడా ఉత్త‌మం.

అలాగే ఎవరైతే ఎక్కువగా ఒత్తిడికి లోన‌వుతుంటారో వాళ్లు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇలా ఉంటే కొంద‌రికి రిలీప్ దొరుకుతుంది. ఇంకొంద‌రు ఒంటరిగా కూర్చుని పుస్తకాల‌ను చ‌దివితే వాళ్ల‌కు ఒత్తిడి దూరం అవుతుంది. అయితే ఇంకో ముఖ్య విష‌యం.. ఎక్కువసేపు ఒంటరిగా ఉండొద్దు. ప్ర‌శాంతంగా కూర్చుని ప్ర‌కృతిని ఆస్వాధిస్తే కూడా ఒత్తిడి దూరం అవుతుంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *